హసకొత్తూరులో జలసిరిపై గ్రామసభ
వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై గ్రామస్తులకు అవగాహన
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో జల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ నలిమేళ రేవతి గంగారెడ్డి ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రేవతి గంగారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సోక్‌పిట్స్ లేదా మ్యాజిక్ సోక్‌పిట్స్ నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఊట గుంటలు, కమ్యూనిటీ ఊట గుంటలు నిర్మించాలని, భూగర్భ జలాల పెంపుదలకు బోరుబావుల వద్ద రీఛార్జ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయడం అవసరమని వివరించారు.
ఈ చర్యల ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే ప్రతి ఇంటిలో నాలుగు రకాల చెత్త డబ్బాలను ఉంచి చెత్తను వేర్వేరుగా సేకరించి, గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందజేయాలని గ్రామసభకు హాజరైన ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సయ్య, ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, వార్డు సభ్యులు కాశవ్వ, జమున, జుంబరాత్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్, మాజీ సర్పంచ్ చిటికెసి గంగాధర్, అందేటి రమేష్, మండపల్లి మహేందర్, ఏఎన్‌ఎం మమత, వీఏవోలు వీణ, సాగరిక, ఆశా వర్కర్లు, మహిళా సంఘ సభ్యులు, రైతులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
