భారీ వర్షాలతో సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లోకి వరద నీరు..

యార్డుల్లో నిల్వ ఉన్న బొగ్గు సరఫరా కొనసాగింపు

గోదావరిఖని, ఆంధ్రప్రభ : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింది. బుధవారం కూడా పలు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు వెలికితీత కష్టతరంగా మారింది.

కోల్‌బెల్ట్ ప్రాంతంలోని 16 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో సాధారణంగా రోజుకు 1.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపడుతుంటారు. అయితే నిరంతర వర్షాల కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఎడతెరిపి లేని వర్షాలతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరింది. గ్రేడర్లు, డోజర్ల సహాయంతో వరదతో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. భారీ మోటార్లతో గనుల్లోకి చేరిన వరద నీటిని బయటకు పంపించే చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రాజెక్టుల్లో ఉన్న కోట్లు విలువైన భారీ యంత్రాలకు ఎలాంటి నష్టం జరగకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వాహనాలన్నింటినీ యార్డులకు తరలించి భద్రపరిచారు.

కొన్ని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న సీమల నుంచి పరిమితంగా బొగ్గు వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మెజారిటీ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి కొనసాగించడం సాధ్యపడడం లేదు. ప్రస్తుతం యార్డుల్లో నిల్వ ఉన్న బొగ్గును మాత్రమే పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు.

రామగుండం రీజియన్-1, 2, 3 పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు వెలికితీత దాదాపు నిలిచిపోయింది. సింగరేణిలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి జరిగే రామగుండం ప్రాంతంలో రోజుకు సుమారు 50 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

అలాగే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, బెల్లంపల్లి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో కూడా భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అక్కడ కూడా కోల్ యార్డుల్లో నిల్వ ఉన్న బొగ్గును మాత్రమే రవాణా చేస్తున్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లోని ఉపరితల గనుల్లోనూ బొగ్గు ఉత్పత్తి కష్టతరంగా మారింది.

సాధారణంగా రోజుకు సుమారు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ (ఓబీ) మట్టిని తొలగించాల్సి ఉండగా, వర్షాల కారణంగా ఆ పనులు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం.

ఉపరితల గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో కొన్ని ప్రాజెక్టుల్లో ఖరీదైన యంత్రాలు నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వాటికి ఎలాంటి నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, ఓసీపీల్లోకి చేరిన వరద నీటిని భారీ మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు.

అప్రమత్తమైన అధికారులు

భారీ వర్షాల నేపథ్యంలో సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో వరద నీటి ప్రభావంతో కోట్లు విలువైన యంత్రాలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

వర్షాల పరిస్థితిని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. గంట గంటకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఏరియా జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.