ఏపీ పారిశ్రామిక రంగంలో మొదలైన భారీ మార్పు ఏంటి..?
ఏపీ పారిశ్రామిక రంగంలో మొదలైన భారీ మార్పు ఏంటి..?
ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విజయవాడలో నిర్వహించిన “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026” రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
ఈ సమ్మిట్‌కు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విస్తరణే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన బలం అవుతుందని స్పష్టం చేశారు.
విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కళా వేదికను సీఎం ప్రారంభించారు. అదే వేదికపై 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే తొలి రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగి, కొన్ని కార్యకలాపాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు.
కీలక ఒప్పందాలకు శ్రీకారం
సమ్మిట్‌లో దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదిరాయి. Meta Platforms, Amazon, Zoho Corporation వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదరడం రాష్ట్రానికి పెట్టుబడుల పరంగా కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
నాలెడ్జ్ ఎకానమీ, డిజిటల్ ఇన్నోవేషన్, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ యువతకు విస్తృత అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
ఈ సమ్మిట్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక మౌలిక వసతులు, తక్కువ సమయంలో అనుమతులు, భూ కేటాయింపుల సౌలభ్యం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్లకే భూ కేటాయింపు అధికారాలు ఇవ్వడం ద్వారా వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని అధికారులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. Ratan Tata Innovation Hub ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించారు.
గ్రామీణ యువతను స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్లడం, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు రూ.200 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, చిన్న పరిశ్రమలకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించడం ద్వారా పోటీ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని విస్తరించడం ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ప్రముఖ పారిశ్రామిక, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
