ఆన్‌లైన్ మందుల మాఫియాపై సమరం

ఆన్‌లైన్ మందుల మాఫియాపై సమరం

  • కృష్ణా జిల్లాలో మెడికల్ బంద్ వంద శాతం సక్సెస్
  • కార్పొరేట్ దోపిడీ, నకిలీ మందుల దందా ఆపకపోతే ‘మెడికల్ ఎమర్జెన్సీ’ తప్పదు
  • అసోసియేషన్ అధ్యక్షుడు కొండపల్లి బుజ్జి
  • రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ-ఫార్మసీలు
  • తక్షణమే నిషేధించాల్సిందే

విజయవాడ, ఆంధ్రప్రభ:

కార్పొరేట్ శక్తుల దోపిడీ,ఆన్‌లైన్ మందుల అక్రమ దందా నుండి ప్రజారోగ్యాన్ని,లక్షలాది మంది సంప్రదాయ ఔషధ వ్యాపారుల జీవనోపాధిని కాపాడుకోవడానికే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ల్యాకౌట్ నిరసన చేపట్టామని,ఈ బంద్ వంద శాతం విజయవంతమైందని ది కృష్ణా డిస్ట్రిక్ట్ హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.సి. కేశవరావు, కార్యదర్శి పి. మురళీకృష్ణ(కొండపల్లి బుజ్జి ), కోశాధికారి జి. సురేష్ స్పష్టం చేశారు.

ఐఓసీడ్ పిలుపులో భాగంగా జరిగిన ఈ నిరసనను ఉద్దేశించి వారు మాట్లాడుతూ,ప్రాణాధారమైన ఔషధ రంగాన్ని ఆన్‌లైన్ వ్యాపార మాఫియాకు ధారాదత్తం చేస్తూ,చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ-ఫార్మసీల విక్రయాలను ప్రభుత్వం తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు.నిబంధనలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అడ్డగోలు డిస్కౌంట్లు, కేవలం చిన్న వ్యాపారులను మార్కెట్ నుండి తుడిచిపెట్టే కుట్రలో భాగమేనని వారు మండిపడ్డారు.

నాణ్యతా ప్రమాణాలు లేని, నకిలీ, నిషిద్ధ మందులను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శక్తులపై ప్రభుత్వం జీఎస్ఆర్ 220 నిబంధనల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం లాభాపేక్షతో రోగుల జీవితాలను ఫణంగా పెడుతున్న ఆన్‌లైన్ విధానాన్ని అరికట్టకపోతే, రాబోయే రోజుల్లో ఔషధ సరఫరాలను పూర్తిగా నిలిపివేసి దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ తరహాలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అసోసియేషన్ నాయకత్వం ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది.