మహానాడు విజయవంతం

మహానాడు విజయవంతం
ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులు
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ జాతీయ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ 9, 10 పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిందని గుర్తు చేశారు. కరణం–పట్వారి వ్యవస్థలను రద్దు చేసిన ఘనత టీడీపీదేనని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రూపకర్తగా రాష్ట్ర అభివృద్ధికి దార్శనికతతో పనిచేస్తున్నారని కొనియాడారు. అలాగే నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, సంక్షోభ సమయంలో ఆపన్నహస్తంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనతో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్టీ సెల్ నాయకులు బాణావత్ భీమానాయక్, దాడి రామారావు, యలినేని చంద్రశేఖరరావు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
