విధుల్లో అర్చకుల నిర్లక్ష్యం…

విధుల్లో అర్చకుల నిర్లక్ష్యం…
కఠిన చర్యలు తీసుకున్నఈవో..
ఇద్దరిపై సస్పెన్షన్ వేటు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అర్చకులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 25 రాత్రి శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో మూడవ షిఫ్ట్‌లో విధులు నిర్వహించాల్సిన ఉప ప్రధాన అర్చకుడు పి. శ్రీనివాసశర్మ గైర్హాజరైనట్లు గుర్తించారు.
అదేవిధంగా పరిచారకుడు కె. నాగరాజు కూడా విధుల్లో లేనట్లు తేలింది. ఆ సమయంలో ఆలయ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఈవో ఈ విషయాన్ని గుర్తించి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరినీ తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు. దేవస్థానం సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో కచ్చితంగా హాజరై బాధ్యతగా వ్యవహరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శీనా నాయక్ స్పష్టం చేశారు.

