తుగ్గలిలో ఊపందుకున్న ఉపాధి హామీ పనులు

తుగ్గలిలో ఊపందుకున్న ఉపాధి హామీ పనులు

వలసలకు చెక్.. గ్రామాల్లోనే కూలీలకు ఉపాధి
సకాలంలో వేతనాలు అందడంతో కార్మికుల్లో ఆనందం

తుగ్గలి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన తుగ్గలి లో తుగ్గలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. వేసవి కాలంలో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలకు ఈ పనులు పెద్ద అండగా నిలుస్తున్నాయి. గ్రామాల్లోనే ఉపాధి లభించడంతో కుటుంబాలను విడిచి వెళ్లాల్సిన అవసరం లేక కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుగ్గలి లో చెక్‌డ్యాంల లో పూడికతీత పనులు, మట్టి పనులు, కాలువల శుభ్రపరిచే పనులు, చెరువుల అభివృద్ధి, మొక్కల సంరక్షణ వంటి పనులు కొనసాగుతున్నాయి.

ప్రతిరోజూ వందలాది మంది మహిళలు, పురుషులు ఈ పనుల్లో పాల్గొంటూ జీవనోపాధి పొందుతున్నారు. గతంలో పనులు లేక ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లిన అనేక కుటుంబాలు ప్రస్తుతం గ్రామాల్లోనే ఉంటూ పనులు చేసుకుంటున్నాయి. స్థానికంగా పనులు దొరకడంతో ప్రయాణ ఖర్చులు, ఇబ్బందులు తప్పుతున్నాయని కూలీలు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు ప్రభుత్వం సకాలంలో వేతనాలు జమ చేస్తుండటంతో కార్మికుల్లో ఆనందం నెలకొంది. బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ కావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు అందుతున్నాయని కూలీలు తెలిపారు.

గ్రామాభివృద్ధికి దోహదం..

ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. చెరువుల పూడిక తొలగింపు, రహదారుల మరమ్మతులు, నీటి వనరుల అభివృద్ధి వంటి పనులు గ్రామాలకు ఉపయోగకరంగా మారుతున్నాయి. దీని వల్ల భవిష్యత్తులో వ్యవసాయానికి కూడా మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఏపీవో రామకృష్ణ , జూనియర్ ఇంజనీరు రాజశేఖర్ లు పరివేక్షణ చేస్తూ పనులు నాణ్యతగా జరిగేలా తరచూ పరిశీలనలు నిర్వహిస్తున్నారు. హాజరు నమోదు, వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తూ, గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న ఉపాధి హామీ పథకం తుగ్గలి మండలంలో కూలీల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోంది.