అసభ్య ప్రవర్తన ఆనందం కాదు.. అది చట్టరీత్యా నేరం

అసభ్య ప్రవర్తన ఆనందం కాదు.. అది చట్టరీత్యా నేరం
పరివర్తనే శాశ్వత పరిష్కారం — నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు
నరసరావుపేట, ఆంధ్రప్రభ: మహిళలు, బాలికల భద్రతను బలోపేతం చేయడం, లైంగిక నేరాల పునరావృతిని నిరోధించడం లక్ష్యంగా ఆపరేషన్ దండయాత్రలో భాగంగా ఆపరేషన్ పరివర్తన సదన్ కార్యక్రమం మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ అసభ్య ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందం కాదని, అది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. వ్యక్తులలో పరివర్తన రావడమే శాశ్వత పరిష్కారమని తెలిపారు.

గతంలో బాలురు, బాలికలు స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం చిన్నారుల భద్రతపై ప్రతి కుటుంబం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లైంగిక నేరాలపై కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతోందని, అరెస్టుల అనంతరం 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి, 90 రోజుల్లో విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ద్వారా ఇలాంటి కేసులు ఏడాది లోపే తుది తీర్పుకు వచ్చే అవకాశాలు పెరిగాయని తెలిపారు. చట్టాలపై అవగాహనతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఎస్.ఓ.ఎస్. షీట్లు మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తులో మళ్లీ నేరాలకు పాల్పడితే రౌడీషీట్లు తెరవబడతాయని హెచ్చరించారు.
సమాజంలో మహిళలు, చిన్నారుల గౌరవం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిలో సానుకూల పరివర్తన రావాలని, ఆ మార్పు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాషిని, ఒకటవ పట్టణ సీఐ ఎస్.కె.టి. ఫిరోజ్, రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావు, దాచేపల్లి సీఐ ఎం. రాజేష్, సీనియర్ న్యాయవాది నజీమా, సైక్రియాటిస్ట్ డాక్టర్ సుస్మిత, ఆర్.వి.ఆర్ కాలేజీ లెక్చరర్ రాజ్యలక్ష్మి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
