సోషల్ మీడియా వ్యాఖ్యలు వివాదం..

సోషల్ మీడియా వ్యాఖ్యలు వివాదం..

వైసీపీ నేత ప్రణీత్ రెడ్డిపై కేసు

టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసుల చర్య.. విచారణ ప్రారంభం

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపుల ఆరోపణలు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి. సాయి ప్రణీత్ రెడ్డిపై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో టీడీపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.

టీడీపీ నేతల ఆరోపణల ప్రకారం, ప్రణీత్ రెడ్డి పదేపదే సోషల్ మీడియా ద్వారా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారని, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా కదిరి ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రణీత్ రెడ్డిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ వ్యవహారం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.