వైభవంగా ఆది దంపతుల గిరిప్రదక్షిణ..

వైభవంగా ఆది దంపతుల గిరిప్రదక్షిణ..

తిరువీధుల్లో విహరించిన స్వామి వారు అమ్మవారు..
మారుమ్రోగిన భవాని నామస్మరణ..
తన్మయత్వంలో పులకరించిన భక్త జనులు..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వైశాఖ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శుక్రవారం ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు,శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండిత ఉవాచ. వైశాఖ పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు.దేవస్థానం ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు.

సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్ణయించిన మార్గంలో సాగింది. ఘాట్ రోడ్ శ్రీ అమ్మవారి గుడి,కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరిప్రదక్షిణ కొనసాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లోస్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ, ప్రసాదంను భక్తులకు దేవస్థానం నుండి అందజేయడమైనది. వేలాది మంది భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply