బస్టాండ్ దుస్థితిపై ఎంపీ సీరియస్..

బస్టాండ్ దుస్థితిపై ఎంపీ సీరియస్..

ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు!

సీఎస్‌ఆర్ నిధులతో ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు

మచిలీపట్నం ఆంధ్రప్రభ: మచిలీపట్నం బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. శనివారం ఆయన ఆకస్మికంగా మచిలీపట్నం బస్టాండ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఇటీవల బస్టాండ్ దుస్థితిపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో స్పందించిన ఎంపీ, వర్షాలు కురిసినప్పుడు బస్టాండ్ మొత్తం నీటమునిగిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో పేరుకుపోయిన నీరు, పారిశుద్ధ్య సమస్యలు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు.

ఈ సందర్భంగా బస్టాండ్‌ను ఆధునీకరించి సుందరీకరించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను వినియోగించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

బస్టాండ్ సముదాయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన నిధుల సమీకరణకు తాను కృషి చేస్తానని ఎంపీ వల్లభనేని బాలశౌరి హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎంపీ పర్యటనతో బస్టాండ్ సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.