యార్లగడ్డ ఆదేశాలతో వాటర్ ట్యాంకుల శుభ్రత కార్యక్రమం

గన్నవరం, ఆంధ్రప్రభ: ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సురక్షిత తాగునీటి పథకాల వాటర్ ట్యాంకులను శుభ్రం చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని గ్రామ పంచాయతీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ మేరకు బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో వాటర్ ట్యాంకును శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. అలాగే గన్నవరం మండలం అల్లాపురం గ్రామంలో తాగునీటి సరఫరా కేంద్రం వద్ద మురుగునీరు పేరుకుపోయిన విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆయన, వాటర్ పిట్‌తో పాటు గ్రామంలోని డ్రైనేజీలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులు వాటర్ పిట్‌ను శుభ్రం చేసి, కచ్చా డ్రైన్ల శుభ్రత కోసం నివాసితులకు నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని ఆర్వో ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి నీటి నాణ్యత పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన చోట ఫిల్టర్లను మార్చి ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.