గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
బంటుమిల్లి, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో నిర్వహించిన ‘వికసిత్ భారత్–జి రామ్జి’ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త గ్రామీణ ఉపాధి పథకంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ ద్వారా గ్రామీణ కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచనున్నట్లు తెలిపారు.
ఈ పథకం కింద గ్రామ పంచాయతీల ద్వారా రహదారుల నిర్మాణం, నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధి కల్పించి, గ్రామాల సమగ్ర అభివృద్ధే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
గ్రామసభల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు, గ్రామాలను వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
