వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- పెట్రోల్ బంకులు ఆకస్మిక తనిఖీలలో తహసీల్దార్ రిబ్కా రాణి
భవానిపురం, ఆంధ్రప్రభ: రాష్టంలో పెట్రోల్, డీజిల్ కొరత వార్తల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ తహసీల్దార్ రిబ్కా రాణి తమ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులను సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్ బంక్ యజమానులు ఇంధనాన్ని దాచిపెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పెట్రోల్ బంకులను తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంధనాన్ని దాచిపెట్టి అధిక ధరలతో అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ యజమానులను హెచ్చరించారు.వాహన వినియోగదారులు భయాందోళనలతో అధిక సంఖ్యలో పెట్రోల్ బంకులు వద్దకు వచ్చి అధిక నిల్వలతో పెట్రోల్ కొనుగోలు చేయడంతో ఉన్న నిలువలు వెంటనే అయిపోతున్నాయని అధికారులకు బంక్ డీలర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పశ్చిమ తాసిల్దార్ వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగినంత ఇంధనం సరఫరా జరుగుతోందని రెండు రోజుల్లో మాములు పరిస్థితి ఏర్పడుతుందని, అవసరానికి మించి నిల్వలు ఉంచవద్దని విజ్ఞప్తి చేశారు.
