ఖమ్మంను విధ్వంసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

కాంగ్రెస్ నాయకులు

మంత్రి తుమ్మలపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరిక

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరాన్ని విధ్వంసం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వచ్ఛమైన, ప్రశాంతమైన ఖమ్మాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండగా, ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, కాంగ్రెస్ నాయకులు కమర్తపు మురళి, కొప్పెర ఉపేందర్ తదితరులు మాట్లాడారు.

ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యామ్ నిర్మాణ సమయంలో అప్పటి ఇంజినీరింగ్ అధికారులు భవిష్యత్తులో వరద ముప్పు ఉంటుందని హెచ్చరించినప్పటికీ, కాంట్రాక్టుల కోసం వాటిని పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. రెండున్నర కోట్ల రూపాయల అంచనాను పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.

తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిపోయి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ ఖమ్మం, ప్రశాంత ఖమ్మం లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

మంత్రి తుమ్మలపై అవాస్తవ ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు.

రానున్న రోజుల్లో మంత్రి తుమ్మల నాయకత్వంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ఖమ్మం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తుందని కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ మేయర్ పునుకొల్లు నీరజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, ఓబీసీ సెల్ చైర్మన్ బాణాల లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రుద్రగాని ఉపేందర్, కన్నం ప్రసన్న, డోన్‌వాన్ రవినాయక్, బాలగంగాధర్ తిలక్, నల్లపు శ్రీనివాస్, తొగురు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.