సమాచారాన్ని సకాలంలో అందించాలి..
సమాచారాన్ని సకాలంలో అందించాలి..
ప్రజలకు చేరవేయడం పారదర్శకతకు పునాది
డిఆర్ఎం మోహిత్ సొనాకియా
భారతీయ రైల్వేల్లో తొలిసారిగా ప్రత్యేక పీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించిన విజయవాడ డివిజన్
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజలకు సకాలంలో, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా పారదర్శకతను పెంపొందించడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయాలని దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. శాఖల విజయాలు, భద్రతా చర్యలు, ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు విజయవాడ డివిజన్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు విజయవాడ డివిజన్‌లో పబ్లిక్ రిలేషన్స్ కార్యకలాపాలు, పీఆర్ క్యాలెండర్ అమలు, కీలక పనితీరు సూచికల పర్యవేక్షణపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. భారతీయ రైల్వేల్లో సమాచార వ్యాప్తిపై ప్రత్యేకంగా పీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించిన తొలి యూనిట్‌గా విజయవాడ డివిజన్ నిలిచింది. సమావేశంలో శాఖల నుంచి సమాచార సేకరణకు ప్రామాణిక విధానాలు, నివేదికల సమర్పణకు గడువులు, పీఆర్ కేపీఐ మ్యాట్రిక్స్ ద్వారా పర్యవేక్షణ, సమాచారాన్ని నిరంతరం నవీకరించడం వంటి అంశాలపై చర్చించారు. ప్రతి శాఖ నుంచి సమాచార సమన్వయ బాధ్యతల కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని నిర్ణయించారు.
ప్రతి శాఖ బాధ్యత తీసుకోవాలి…
ఈ సందర్భంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, సమాచార వ్యాప్తి కేవలం పబ్లిక్ రిలేషన్స్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి శాఖ తన కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రైల్వే ఉద్యోగుల కృషి, భద్రతా చర్యలు, ప్రయాణికుల సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరితే సంస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. పీఆర్ శాఖ మీడియా సంబంధాలకే పరిమితం కాదని, డివిజన్ కమ్యూనికేషన్ కేంద్రంగా పనిచేస్తూ శాఖల విజయాలు, ప్రయాణికుల సేవలు, ఉద్యోగుల సేవలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యత నిర్వహిస్తోందని చెప్పారు. శాఖల పీఆర్ సమన్వయకర్తలు పీఆర్ కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా సమాచారాన్ని వేగంగా ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు.
ప్రజల్లో అవగాహన పెరుగుతుంది…
ఈ సందర్భంగా అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పి.ఈ. ఎడ్విన్ మాట్లాడుతూ, రైల్వే చేపట్టే ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, సేవల మెరుగుదల ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ విజయాలను మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు చేరవేయడం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం పెరుగుతాయని పేర్కొన్నారు.
సమావేశంలో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ రావు కొండా, పబ్లిక్ రిలేషన్స్ అధికారి నుస్రత్ ఎం. మండ్రుప్కర్, వివిధ శాఖల అధికారులు, పీఆర్ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఆపరేషనల్ విజయాలు, ఉద్యోగుల సేవలు, మానవీయ కథనాలు తదితర అంశాలపై సమాచారాన్ని సకాలంలో ప్రజలకు చేరవేసేందుకు ఈ సమావేశం కీలక అడుగుగా నిలిచిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. భారతీయ రైల్వేల్లో డేటా ఆధారిత పబ్లిక్ రిలేషన్స్ వ్యవస్థను బలోపేతం చేయడంలో విజయవాడ డివిజన్ చేపట్టిన ఈ చర్య విశిష్ట మైలురాయిగా నిలవనుంది.
