జిందాల్ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్

వ్యర్థాల ఆధారిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంపుపై అధికారులకు ఆదేశాలు

యడ్లపాడు, ఆంధ్రప్రభ: జిల్లా పారిశ్రామికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. గురువారం యడ్లపాడు మండలం కొండవీడు గ్రామపంచాయతీ పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఆమె సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు.

ప్లాంట్‌లో మున్సిపల్ ఘన వ్యర్థాల సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, బాయిలర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, ఉత్పత్తి అనంతరం మిగిలే బూడిదను ఇటుకల తయారీలో వినియోగించే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి గ్రీన్ ఎనర్జీగా మార్చుతున్న విధానంపై అధికారులు, సంస్థ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్లాంట్ యాజమాన్యం, అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నదీ పరీవాహక ప్రాంతాల్లో పేరుకుపోయే వ్యర్థాలను ముందుగానే సేకరించి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వ్యర్థాల ఆధారిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ ఎం.వి. చారి మాట్లాడుతూ, ప్లాంట్‌లో ప్రతిరోజూ సుమారు 1,400 నుంచి 1,650 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నామని వివరించారు. ఒక్క ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు, నగరాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా వ్యర్థాలను సేకరించి ప్లాంట్‌కు తరలించి శాస్త్రీయంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పర్యటనలో పల్నాడు ఆర్డీవో కె. బాలకృష్ణ, ఎంపీడీవో హేమలత దేవి, తహశీల్దార్ విజయశ్రీ, జిందాల్ ఏపీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ఎం.వి. చారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.