వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ..

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ..
పౌర్ణమి వేళ పులకరించిన భక్తజనం.
ఉదయం కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభం
ఈవో శీనానాయక్ దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు
వేలాది మంది భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం విశేష ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డు ప్రవేశద్వారం వద్దనున్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి తదితరులు వేదోక్త పూజలు నిర్వహించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. ఘాట్ రోడ్, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి చేరుకుంది. మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో స్థానిక మహిళలు పసుపు నీటితో రహదారులను శుద్ధి చేసి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు సమర్పిస్తూ జయజయధ్వానాలతో స్వాగతం పలికారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు దేవస్థానం తరఫున అమ్మవారి కుంకుమ, ప్రసాదాలను పంపిణీ చేశారు.

