ఉత్తరాంద్ర ప్రగతి అధ్యాయంలో నూతన శకం.. ‘గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్’

  • గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి
  • కూటమి శ్రేణులు సమన్వయం, ఐక్యతతో భోగాపురం వేడుకలు చరిత్రలో నిలవాలి
  • విజయనగరంలో మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రత్తిపాటి, కోటంరెడ్డి.
  • భోజన, వసతి సౌకర్యాల కల్పనలో చెడ్డపేరు రాకుండా చూసుకోండి

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: దేశాధినేత, ఎన్డీయే సారథి ప్రధాని మోదీ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం మనందరి బాధ్యతని, ఎక్కడా ఎలాంటి లోపం తలెత్తకుండా కూటమి శ్రేణులు సమన్వయం, ముందుచూపుతో ప్రతి కార్యక్రమాన్ని కనివినీ ఎరుగని విధంగా విజయవంతం చేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

ఆగస్ట్ 1న అంగరంగ వైభవంగా జరగనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ, పరిశీలనలో భాగంగా ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం విజయనగరం నుంచి సభా ప్రాంగణానికి వెళ్లే మార్గంలో కూటమిశ్రేణులు ప్రజలకోసం చేసిన భోజన, వసతి ఏర్పాట్లను టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని, స్థానిక నాయకులకు సూచన చేసిన ప్రత్తిపాటి…. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ప్రధాని పర్యటన విజయవంతాన్ని కూటమిప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రగతి అధ్యాయంలో నూతన శకానికి బీజం పడనుందని ప్రత్తిపాటి చెప్పారు. దాకమర్రి (వర్చన్ హిల్స్), ముద్దాడపేట (భూమాత లే ఔట్), వద్ద మోదీ కార్యక్రమానికి విచ్చేసే ప్రజలకోసం ప్రత్యేక భోజన, వసతి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

అశోక్ గజపతిరాజు అనుభవం.. అభివృద్ధి దార్శనికత గోవా ప్రగతికి దోహదం చేస్తాయి : ప్రత్తిపాటి

గోవా అభివృద్ధి ప్రయాణంలో స్థానిక గవర్నర్ అశోక్ గజపతి రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ వ్యవస్థకే వన్నె తెచ్చేలా స్వల్పకాలంలోనే ఆయన స్థానిక ప్రజల మనసులు చూరగొన్నారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా విజయనగరం వెళ్లిన ప్రత్తిపాటి.. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి బుధవారం గోవా గవర్నర్ అశోక్ గజతిరాజుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మోదీ పర్యటన విజయవంతంపై కాసేపు చర్చ జరిగింది.

అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ…

గోవారాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, ప్రజా భద్రత విషయంలో అశోక్ గజపతి రాజు విస్పష్టమైన వైఖరితో ఉన్నారని, ప్రముఖ పర్యాటక ప్రాంత, ప్రత్యేక ప్రకృతి వనరులు, భౌగోళిక స్వరూప విశిష్టత చెక్కుచెదరకుండా భావితరాలకు అందించాలన్న ఆయన గొప్ప లక్ష్యం నెరవేరాలన్నారు. అశోక్ గజతి రాజు అనుభవం, అభివృద్ధి పట్ల ఆయనకున్న దార్శనికత గోవా ప్రగతికి తప్పక దోహదపడతాయని ప్రత్తిపాటి ఆకాంక్షించారు.