రైతులను వెంటనే ఆదుకోవాలి

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

వర్షాభావంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన

మోతె, ఆంధ్రప్రభ: వర్షాభావంతో పత్తి తదితర పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

గురువారం మోతె మండల పరిధిలోని హుస్సేనాబాద్ గ్రామంలో ఆయన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తగినంత వర్షపాతం లేక పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వం, జిల్లా మంత్రి వెంటనే దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇకనైనా రైతుల ఇబ్బందులను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ లింగారెడ్డి, మండల నాయకులు మిక్కిలినేని సతీష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, దేవుల నాయక్, నవీన్ సుధాకర్, బిక్షం తదితరులు పాల్గొన్నారు.