ఉత్తరాంధ్రలో పెట్టుబడుల వెల్లువ

ఉత్తరాంధ్రలో పెట్టుబడుల వెల్లువ

  • రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు
  • విద్యుత్ భారాన్ని భరిస్తున్నాం… ఛార్జీలు తగ్గిస్తున్నాం
  • 22 నెలల్లో 802 ఎంఓయూలు
  • రంగారెడ్డి జిల్లా తరహాలో అనకాపల్లి అభివృద్ధి
  • 160 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యంలో 50%కు పైగా సాధన
  • నాడు కూల్చివేతలు… నేడు అభివృద్ధి పనులు
  • అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
  • రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌కు చెందిన రెండు ప్లాంట్లకు సీఎం చంద్రబాబు భూమిపూజ

రాంబిల్లి-విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మరోసారి తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వం భరిస్తోందని, రెవెన్యూ మరియు విద్యుత్ రంగంలో సంస్కరణల ద్వారా ఛార్జీలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జాతి నిర్మాణంలో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జెడ్ చింతువలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ నిర్వహించారు. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాంబిల్లిలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఇంగాట్-వేఫర్ యూనిట్, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు.

ఈ రెండు ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ద్వారా సుమారు 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. భూమిపూజ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిలో ముందంజలో నిలుస్తుందని తెలిపారు. పెట్టుబడుల పరంగా ఈ జిల్లా దేశంలో అగ్రస్థానానికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు మరో రూ.5,400 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్రాజెక్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు.

విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రెన్యూ ఎనర్జీ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. గత 22 నెలల్లో 802 ఎంఓయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. 2019-24 మధ్య పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేశారని, కారణం వేధింపులు, అవినీతి అని విమర్శించారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు.

పారిశ్రామిక వేత్తలకు సహకరిస్తూ, భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రతి రోజూ పెట్టుబడుల పండుగ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నెల 28న 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగనుందని తెలిపారు. జూలైలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభమవుతుందని, లారస్ ల్యాబ్ రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని, రైల్వే జోన్ కూడా సాధించామని తెలిపారు. విశాఖ-రాజమహేంద్రవరం మధ్య కార్గో కోసం నాలుగు రైల్వే లైన్లతో స్పీడ్ రైల్ కారిడార్ రానుందని చెప్పారు.

గత ప్రభుత్వ తప్పులను సరిచేస్తున్నాం. పేదల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందేలా చర్యలు తీసుకుంటున్నామని, విద్యుత్ రంగంలో గత ప్రభుత్వ లోపాలను సరిచేస్తున్నామని తెలిపారు. 2019-24 మధ్య పీపీఏలు రద్దు చేసి, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల వ్యవస్థ దెబ్బతిందని ఆరోపించారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించాల్సి వచ్చిందని, అదనంగా రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై పడిందని తెలిపారు.

Leave a Reply