తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

రూ.6 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాల అపహరణ

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను అపహరించడంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రేవుల గ్రామానికి చెందిన రైతు, పూజారి తిరుపతయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఆదివారం రాత్రి సమయంలోనే దొంగలు చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తెరిచి అందులో ఉన్న రూ.2 లక్షల నగదు, 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు పలు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చోరీకి గురైన మొత్తం సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ఆచూకీ కోసం ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది.