‘నషా ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్ ఆవిష్కరణ..
(భవానీపురం, ఆంధ్రప్రభ) : వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంతో పాటు దేశ యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ పోస్టర్‌ను సోమవారం ఎన్డీయే కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, గాయత్రి పరివార్ శాఖ, బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సింధూలత మాట్లాడుతూ, యువతను మాదకద్రవ్యాల బారినుంచి దూరం చేసి, వారిలో చైతన్యం కల్పించేందుకు ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ సమగ్ర అవగాహన కార్యక్రమంగా కొనసాగుతోందన్నారు.
ఆగస్టు 6 నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో 10 కోట్ల మంది ప్రజలతో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ రూపొందించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేసి ఆరోగ్యకరమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. అనంతరం స్థానిక యువత, సుజనా మిత్ర కోఆర్డినేటర్లతో కలిసి వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో బీకే వసుంధర, బీకే మాలకొండయ్య, బీకే రాజా, గాయత్రి పరివార్ వన్‌టౌన్ శాఖ ప్రతినిధి బాయన హేరంబ కుమార్, జోగి రాజ్ పురోహిత్, మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలివాడ పట్నాయక్, జనసేన నాయకుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
