Red-Soil-Mafia : బుక్కుడే బుక్కుడు Andhra Prabha Exclusive Story
Red-Soil-Mafia : బుక్కుడే బుక్కుడు Andhra Prabha Exclusive Story
- ఎర్రమట్లే అల్పాహారం
- ఆఫీజర్లు బ్రేవ్
- మాఫియా ఖుషీ ఖషీ
- దొమ్మరాజుదే రోసనూరు రాజ్యం
- సీఎం ఆదేశాలూ భేఖాతర్
- రెవెన్యూ, పోలీస్ కళ్లప్పగింత

ప్రభుత్వ భూములు, చెరువుల్లోని ఎర్రమట్టిని లక్ష్యంగా చేసుకుని రోసనూరు పరిసరాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుండగా, సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను తుంగలో తొక్కుతూ… ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయల ఆదాయానికి గండి కొడుతూ.. అక్రమార్కులు మాత్రం కోట్ల రూపాయల విలువైన ఎర్రమట్టిని దోచుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారుల మౌనం, అనుమతుల పేరుతో జరుగుతున్న తవ్వకాలపై అనుమానాలు, ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతోందనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

( పెళ్లకూరు, ఆంధ్రప్రభ)
తిరుసతి ఙల్లా పెళ్లకూరు మండలం రోసనూరు పంచాయతీలో ఎర్ర బంగారం దోపిడీకి గురవుతుంది. గ్రామానికి నలువైపుల ఎర్ర బంగారం గుట్టలు ఉండడం, పోరంబోకు నేలలు, అసైన్డ్ భూములు, చెరువులు ఎర్రటి నేలను తలపిస్తుండడంతో ఎలాగైనా ప్రభుత్వ సంపద దోచుకుని కోట్ల రూపాయలు గడించాలన్న ధ్యేయంతో దోపిడీ దందా ఈ గ్రామంలో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను బేఖాతర్ చేస్తూ అక్రమార్కులు ఎర్ర బంగారాన్ని దోచుకొని రాత్రి, పగలు తేడా లేకుండా కోట్లు గడిస్తున్నారు. భారీ హిటాచి యంత్రాలతో ఎర్రమట్టిని తోడి టిప్పర్లకు లోడింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారు.
Red-Soil-Mafia : ఇటుక బట్టీలకు తరలింపు

దొరవారిసత్రం మండలంలోని ఏకొల్లు, నాయుడుపేట మండలంలోని విన్నమాల, బైపాస్ రోడ్డు, జువ్వలపాలెం, పెళ్లకూరు మండలంలోని తల్వాయిపాడు గ్రామాల పరిధిలోను ఇటుక బట్టీలకు చెరువులోని మట్టిని తరలించి విక్రయిస్తున్నారు. అనుమతులు ఉన్నచోట నుంచే తరలించాలన్న ఆంక్షలకు చెల్లి చీటీ పెట్టి యధా రాజా తథా ప్రజాగా కొనసాగిస్తున్నారు. రాత్రి, పగలు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నట్లు స్థానికులు బాహాటంగానే వినిపిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడులు సంయుక్తంగా మట్టి, గ్రావెల్, ఇసుక దందాలపై ప్రకటన విడుదల చేసిన పెడచెవిన పెట్టిన అక్రమార్కులు అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. స్థానికంగా ఉంటున్న అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో దర్జాగా దోపిడీకి పాల్పడుతున్నారు.
Red-Soil-Mafia : అధికారులు అడ్డుకోరెందుకు..?

ప్రభుత్వ సంపదను దోచుకొని అక్రమార్కులు కోట్లు గడిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలన్న సూచనలను సైతం పెడచెవిన పెట్టారు. మైనింగ్ శాఖ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న తీరుపై గ్రామంలోని విద్యావంతులు, యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు జరుగుతున్న అక్రమాలపై సమాచారం అందించాల్సిన స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ అధికారుల సైతం ముక్కుసూట్టిగా వ్యవహరించక పోవడంతోనే అక్రమాలకు తావిస్తున్నారని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Red-Soil-Mafia : ప్రభుత్వ ఆదాయానికి గండి

ఇటీవల జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి మాఫియాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా దందాలకు పాల్పడే వారిని ఉపేక్షించొద్దని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్, ఎస్పీ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఇసుక, మట్టి మాఫియాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే కొందరు అధికారులు మాత్రం ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారు. సమాచారం అందించాల్సిన ప్రత్యేక శాఖలు ఉన్నతాధికారులను సమాచారం ఇవ్వకుండా తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపణలు సైతం ప్రజల్లో వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారుల దృష్టిసారించి మండలంలో గ్రావెల్, మట్టి, ఇసుక తోలకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే తప్పా దోపిడీని నివారించలేరని కూటమి నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.
Red-Soil-Mafia : రోడ్డు అవసరాలకే అనుమతులు
పెళ్లకూరు, నాయుడుపేట, దొరవారిసత్రం మండలాల్లో రోడ్లకు గ్రావెల్ వేసేందుకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చి ఉన్నారు. రోడ్డు నిర్మాణాలకు అవసరమని తీసుకున్నారు.
- సీహెచ్ హరికృష్ణ, తహసీల్దార్
Red-Soil-Mafia : ఇరిగేషన్ అధికారుల అనుమతులతోనే..
రోసనూరు చెరువులో గ్రావెల్, మట్టి తరలింపులకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చి ఉన్నారు. అందుకు సంబంధించిన నకలను పోలీస్ శాఖకు అందించి ఉన్నారు.
- సీఐ, సంగమేశ్వర రావు
Red-Soil-Mafia : ఉల్లంఘిస్తే చర్యలే
రోసనూరు చెరువులో అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలింపుల విషయమై కాంట్రాక్టర్‌ను వివరణ కోరాం. అయితే ఇరిగేషన్ ఎస్ఈ నుంచి అనుమతులు తెచ్చామని సదరు కాంట్రాక్టర్ నోటి మాటగా తెలిపారు. తవ్వకాల అనుమతులకు సంబంధించిన కాపీలు మాకు అందలేదు. ఎస్ఈ జారీ చేసిన అనుమతులు డివిజన్, జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో ఉంటాయి.
- శ్రీనివాసులు, ఇరిగేషన్ ఏఈ
