ఏఐతో వైద్య రంగంలో విప్లవం

ఏఐతో వైద్య రంగంలో విప్లవం

  • ఏపీ మెడటెక్ ఛాలెంజ్ విధానాన్ని కొనసాగించే యోచన
  • పనితీరు ఆధారంగా ఉత్తమ స్టార్టప్‌లకు నగదు ప్రోత్సాహకాలు
  • అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థకు రూ. కోటి వర్క్ ఆర్డర్
  • ఫలితాల వెల్లడికి త్వరలో ప్రత్యేక సదస్సు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే వైద్య సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణల ద్వారా సానుకూల ఫలితాలు కనిపించాయి. రోగులకు వైద్య సేవలు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంకుర సంస్థలను వైద్య ఆరోగ్య శాఖ త్వరలో ఎంపిక చేయబోతోంది. 4 కేటగిరీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే అంకుర సంస్థలకు (మొత్తం 12) ప్రభుత్వం రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున కలిపి మొత్తం రూ.40 లక్షలను ప్రోత్సాహకాలుగా ఇవ్వనుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఒక అంకుర సంస్థకు మాత్రం రూ.1 కోటి విలువైన వర్క్ ఆర్డర్ ఇస్తారు. ఇందుకు సంబంధించిన చర్యలను ఐటీ విభాగం జారీ చేసిన జీఓ నంబర్ 33 ప్రకారం అధికారులు తీసుకుంటున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన ఏపీ మెడ్‌టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌కు అనుగుణంగా డయాగ్నస్టిక్ టూల్స్, పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్, స్మార్ట్ మానిటరింగ్ & వేరబుల్స్, రిమోట్ కేర్ టెలిమెడిసిన్ కేటగిరీల్లో ఈ అంకుర సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ సేవలను అందించాయి.

ఫలితాలిలా…
ఈ అంకుర సంస్థలు ఫిబ్రవరిలో ప్రారంభించి మార్చి వరకు రోగులకు వైద్యుల సమక్షంలో సేవలు అందించాయి. మొత్తం 37 రోజుల్లో 12,677 మందికి సేవలు అందించగా, 7,433 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 15 నుంచి 25 శాతం మందిలో టీబీ ప్రాథమిక దశలో గుర్తింపు జరిగింది. మరో అంకుర సంస్థ 1,200 మందిని స్క్రీనింగ్ చేయగా 34 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని, 10 మందికి గ్లూకోమా సమస్య ఉన్నట్లు వెల్లడైంది. ఇంకో సంస్థ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయగా 15 మందిలో అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలో 30 మంది నవజాత శిశువుల్లో శ్వాస సంబంధిత సమస్యలు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 323 మందికి గుండె పరీక్షలు చేయగా 2.17 శాతం మందిలో గుండె పనితీరులో సమస్యలు ఉన్నట్లు తేలింది. అలాగే 2,100 మంది రోగులతో వైద్యులు ఏఐ స్క్రైబ్ ద్వారా మాట్లాడటంతో సాధారణ సమయంతో పోలిస్తే 70 శాతం సమయం ఆదా అయింది.

విశాఖ, అనంతపురం, గుంటూరు, పాడేరు, కర్నూలు, కాకినాడ జీజీహెచ్, విజయవాడ, తిరుపతి రుయా, విశాఖ మానసిక ఆసుపత్రి, వెస్ట్ గోదావరి చాగల్లు పీహెచ్సీ, తూర్పుగోదావరి రాజానగరం ఉప ఆరోగ్య కేంద్రం, తెనాలి జిల్లా ఆసుపత్రి, పార్వతీపురం జిల్లా ఆసుపత్రి, విశాఖ విక్టోరియా ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఈ ఆవిష్కరణలు అమలు చేశారు.

ఏఐ ఫలితాలపై త్వరలో సదస్సు
ఈ ఆవిష్కరణల ప్రయోజనాలపై అమరావతిలో త్వరలో సదస్సు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల ప్రభుత్వ వైద్యులను పిలిచి, వైద్య విద్యార్థులు, బోధకులు, ఇతర వర్గాలను కూడా ఆహ్వానించనున్నారు. నేషనల్ హెల్త్ అథారిటీ, ఈ-హెల్త్ స్టార్టప్ ఇండియా, ఇండియా ఏఐ మిషన్, ఐఐటీ కాన్పూర్ తదితర సంస్థలకు ఆహ్వానాలు పంపనున్నారు.

దేశంలోనే తొలిసారి
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏకకాలంలో అంకుర సంస్థల ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ఫలితాలను త్వరలో క్యాథ్ కమిటీ ముందు ప్రవేశపెట్టి ఉత్తమ సంస్థలను ఎంపిక చేస్తారని వెల్లడించారు.

Leave a Reply