ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి

ఉద్యమకారులకు సమరయోధుల హోదా కల్పించాలని డిమాండ్

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసి పోరాడిన ఉద్యమకారులను తక్షణమే గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు కల్వచర్ల సుదర్శన్ డిమాండ్ చేశారు.

సోమవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలను గుర్తించి వారికి తగిన గౌరవంతో పాటు సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కేకే కమిటీ సిఫారసుల మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను త్వరగా గుర్తించి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. కేకే కమిటీ నివేదికను మరింత ఆలస్యం చేయకుండా ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరారు.

భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి జీవన భృతి కల్పించినట్లే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కూడా రాష్ట్ర సమరయోధులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే 65వ డివిజన్ ఎల్లాపూర్ గ్రామంలో బతుకమ్మ ఆడేందుకు ఆట స్థలం, పెద్ద చెరువు వద్ద మెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

గ్రామంలోని రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, గ్రామ శివారులోని సాంబ చెరువు సమీపంలో స్మశానవాటిక ఏర్పాటుకు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేయాలని గ్రామస్థులకు సూచించారు.