హార్ముజ్‌పై ఆధిపత్య పోరు.. తీవ్ర హెచ్చరికలు

హార్ముజ్‌పై ఆధిపత్య పోరు.. తీవ్ర హెచ్చరికలు

  • జలసంధి మాదే… నియంత్రణా మాదే
  • నౌకలకు నో ఎంట్రీ.. సీమైన్లు వేసే బోట్లను ముంచేస్తాం
  • బోట్లలో ఉన్నవారిని కాల్చి చంపేస్తాం
  • మైన్లను తొలగిస్తున్నాం
  • ఒప్పందం కోసం ఇరాన్‌పై ఒత్తిడి చేస్తున్నాం
  • శుక్రవారం శుభవార్త ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దిగ్బంధనం తొలగించే వరకు చర్చలకు నో అంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో టెహ్రాన్ వీధుల్లో క్షిపణుల ప్రదర్శన నిర్వహించింది. రెండవ విడత అమెరికా-ఇరాన్ చర్చలు నిర్వహించడానికి సంబంధించిన దౌత్య ప్రయత్నాలపై చర్చలు కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ పొడిగింపు ప్రకటనను మంత్రి నఖ్వీ స్వాగతించారు. ఇది ఉద్రిక్తతలను తగ్గించడంలో ముఖ్యమైన పురోగతి అని అభివర్ణించారు. ఇరాన్ వైపు నుంచి సానుకూల స్పందన ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దౌత్యపరమైన, శాంతియుత పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో పాకిస్తాన్ నిర్మాణాత్మక, బాధ్యతాయుత పాత్రను నటాలీ బేకర్ ప్రశంసించారు.

ట్రంప్ వ్యాఖ్యపై ఉత్కంఠ
ఇంతకు ముందు ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్లో మొదటి విడత చర్చలు జరిగాయి. అవి ఒప్పందం లేకుండా ముగిశాయి. ప్రస్తుతం రెండవ విడత చర్చలు వీకెండ్ లేదా శుక్రవారం జరిగే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికాతో రెండవ విడత చర్చలకు ఇరాన్ నిరాకరించింది. ట్రంప్ చేసిన కాల్పుల విరమణ పొడిగింపు ప్రకటనను అర్థరహితంగా పేర్కొంది. ఒకవైపు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలను, ఓడరేవులను అడ్డుకుంటూ పొడిగింపు ప్రకటన చేయడం అసంబద్ధమని తెలిపింది. అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నామని అమెరికా ప్రకటించడంతో, చర్చల్లో ఇరాన్ పాల్గొనే అవకాశాలు తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇరాన్ ట్యాంకర్ స్వాధీనం
వాషింగ్టన్: అమెరికా సైనిక దళాలు ఇరాన్‌తో సంబంధం ఉన్న “మెజెస్టిక్ ఎక్స్” అనే ఆయిల్ ట్యాంకర్ను గురువారం హిందూ మహాసముద్రంలో స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకారం, ఈ ట్యాంకర్‌పై మెరైన్ ఇంటర్‌డిక్షన్ ఆపరేషన్ నిర్వహించి బోర్డ్ చేశారు. ఈ చర్య ఎలాంటి ఘర్షణ లేకుండా జరిగింది. పెంటగాన్ విడుదల చేసిన వీడియోలో అమెరికా సైనికులు ట్యాంకర్ డెక్‌పై ఉన్నట్లు కనిపించింది. ఈ ట్యాంకర్ గయానా జెండాతో నడుస్తోంది. ఇది గతంలో “ఫీనిక్స్” పేరుతో ఉన్నది. 2024లో ఇరాన్ క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్‌కు సంబంధించి ఈ నౌకపై అమెరికా ఆంక్షలు విధించింది.

షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ఈ ట్యాంకర్ శ్రీలంక, ఇండోనేషియా మధ్య హిందూ మహాసముద్రంలో ఉంది. ఇది చైనాలోని జౌషాన్ వైపు ప్రయాణిస్తోంది. ఇంతకు ముందు స్వాధీనం చేసుకున్న “టిఫాని” ట్యాంకర్ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. అమెరికా రక్షణ శాఖ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో అక్రమ నెట్వర్క్‌లను అడ్డుకోవడం, ఇరాన్‌కు మద్దతు ఇచ్చే నౌకలపై చర్యలు కొనసాగుతాయని తెలిపింది. ఇండో-పసిఫిక్ కమాండ్ పరిధిలో ఈ ఆపరేషన్ జరిగింది.

ఈ స్వాధీనం ఇరాన్ ఆయిల్ స్మగ్లింగ్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగా చేపట్టినదని అమెరికా పేర్కొంది. ఇరాన్ చర్యల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పారామిలిటరీ దళాలు ఇటీవల రెండు నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. ఇరాన్ ఆయిల్ ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా టెహ్రాన్ ప్రభుత్వ ఆదాయ మార్గాలను తగ్గించడం అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిణామాలు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ ఘటనపై ఇరాన్ నుంచి తక్షణ స్పందన రాలేదు. ఇటీవలి కాలంలో అమెరికా చేపట్టిన ఇది రెండవ పెద్ద స్వాధీనం. అంతకుముందు “టిఫాని” ట్యాంకర్ను బంగాళాఖాతంలో స్వాధీనం చేసుకుంది.

Leave a Reply