2students | ఈతకు వెళ్లి శవాలై

2students | ఈతకు వెళ్లి శవాలై

2students | వేసవి సెలవుల్లో విషాదం
చెరువులో ఊబి ఇద్దరు మిత్రుల ప్రాణాలు తీశింది
సైకిల్, చెప్పులు చూసి గుండెలు ఆగిపోయిన తల్లిదండ్రులు
యడ్లపాడు గ్రామాన్ని కంటతడి పెట్టించిన ఘటన

2students | యడ్లపాడు, ఆంధ్రప్రభ వేసవి సెలవులు అంటే పిల్లలకు ఎంతో ఇష్టం.. ఆదివారం వచ్చిందంటే చాలు స్నేహితులతో కలిసి ఆడుకోవాలని, ప్రకృతి ఒడిలో గడపాలని ఉవ్విళ్లూరుతారు. కానీ, ఆ సరదానే వారి పాలిట మృత్యుపాశం అవుతుందని, వారి ఇళ్లల్లో తీరని శోకం మిగిలిస్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు.

బోయపాలెం గ్రామానికి చెందిన షేక్‌ మొహమ్మద్‌ అహమ్మద్‌ (17) ఇంటర్ చదువుతుండగా, యడ్లపాడుకు చెందిన షేక్‌ అమానుల్లా (13) స్థానిక హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ ఇద్దరు మిత్రులు సైకిల్‌పై జగ్గాపురం రోడ్డులోని చవిటి చెరువు వద్దకు వెళ్లారు. కాసేపు చేపలు పట్టి సరదాగా గడుపుదామనుకున్నారు.

అయితే, ఆ చెరువు లోతు.. అందులో పొంచి ఉన్న ప్రమాదకరమైన ఊబి గురించి ఆ పసి హృదయాలకు తెలియదు. నీటిలోకి దిగిన కొద్దిసేపటికే ఆ ఊబి వారిని మృత్యువు వైపు లాగేసింది. చీకటి పడుతున్నా బిడ్డలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలింపు మొదలుపెట్టారు. చెరువు ఒడ్డున ఉన్న సైకిల్, చెప్పులు, దుస్తులను చూసి వారి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. పోలీసుల సాయంతో గాలించగా, రెండు గంటల తర్వాత ఆ ఇద్దరు విద్యార్థులు నిర్జీవంగా బయటపడ్డారు.

2students
2students

“నా కొడుకు వస్తాడు.. క్షేమంగా తిరిగి వస్తాడు” అని ఆశగా ఎదురుచూసిన ఆ కన్నవారి కళ్ల ముందు విగతజీవులై పడి ఉన్న బిడ్డలను చూసి ఊరంతా కన్నీరు పెట్టింది. పెరిగి పెద్దయ్యాక తమకు అండగా ఉంటారనుకున్న కుమారులు, ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాల్లో తీరని చీకటి నెలకొంది. ఒక్క క్షణం అజాగ్రత్త.. ఆ చిన్నారుల నవ్వులను శాశ్వతంగా దూరం చేసింది. సోమవారం ఆ ఇద్దరు చిన్నారుల అంత్యక్రియలు జరుగుతుంటే యడ్లపాడు గ్రామం మొత్తం మూగబోయింది.

click here to read కారు-బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు

click here to read more

Leave a Reply