పుష్కరాల్లో భక్తులకు అండగా దుద్దిళ్ల సైన్యం
మహాదేవపూర్ , ఆంధ్రప్రభ : కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దుద్దిళ్ల సైన్యం నిరంతరం సేవలు అందిస్తోంది. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో స్థానిక నాయకులు క్షేత్రస్థాయిలో ఉండి భక్తుల అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మాజీ జడ్పీటీసీ చల్ల తిరుపతి రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, యూత్ కాంగ్రెస్ నాయకుడు కట్కం అశోక్ తదితరులు రెండు రోజులుగా స్థానికంగా మకాం వేసి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.
పుష్కర ఘాట్లు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్లు, వైద్య సేవలు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నారు. భక్తుల నుంచి వస్తున్న సమస్యలు, సూచనలను వెంటనే రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ప్రత్యేకంగా ఎండ తీవ్రత దృష్ట్యా పుష్కర ఘాట్ల వద్ద తాగునీరు, చలివేంద్రాలు, విశ్రాంతి కేంద్రాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా సూచనలు చేస్తున్నారు.
భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేలా స్థానిక నాయకులు నిరంతరం కృషి చేయడం పట్ల యాత్రికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తున్న తీరును పలువురు అభినందిస్తున్నారు.
సరస్వతి అంత్య పుష్కరాలకు రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దుద్దిళ్ల సైన్యం సేవలు మరింత కీలకంగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
