రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పట్టా భూములు కోల్పోతున్న రైతులకు చట్టబద్ధమైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ శనివారం రైతులు ఆర్‌అండ్‌బీ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ పగిడరాయిగుట్ట ఆర్చ్ నుంచి రామలక్ష్మీపురం గ్రామం వరకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పట్టా భూముల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూములపైనే జీవనం సాగిస్తున్నామని, హుజూర్‌నగర్, రామలక్ష్మీపురం గ్రామాల పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో తమకు చట్టబద్ధమైన పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూములే తమ కుటుంబాలకు ఏకైక జీవనాధారమని పేర్కొన్నారు.
తాము చిన్న, సన్నకారు రైతులమని, ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు భూములు కలిగి ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వల్ల 25 మందికి పైగా రైతులు తమ భూములు, జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన భూసేకరణ చట్టం ప్రకారం తమకు తగిన నష్టపరిహారం చెల్లించి, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు మర్రి జితేందర్ రెడ్డి, జెట్టి తేజస్, దొంతిరెడ్డి శంభిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బండారు రవి, రాములు, భాగ్యమ్మ, కొప్పుల వెంకటరెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
