అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి
- కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : నిర్దిష్ట గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.
గురువారం వరంగల్ పరిధిలోని 100 ఫీట్ల రోడ్డు, ఏనుమాముల ప్రాంతం, ధర్మారం రోడ్డు, డాక్టర్స్ కాలనీ, కాశీబుగ్గ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి కొనసాగుతున్న, పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా నర్సంపేట రోడ్డులోని ఏనుమాముల 100 ఫీట్ల రోడ్డులో కొనసాగుతున్న పైప్డ్ డ్రెయిన్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే బిల్లుల చెల్లింపుల కోసం ధర్మారం, డాక్టర్స్ కాలనీ ప్రాంతాల్లో పూర్తయిన డ్రెయిన్లు, సీసీ రోడ్ల పనులను తనిఖీ చేశారు.
కాశీబుగ్గలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పూర్తయిన గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను కలెక్టర్ స్వయంగా కొలతలు వేసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులు నాణ్యతతో, పారదర్శకంగా చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ సంతోష్‌బాబు, ఎంహెచ్‌వో డాక్టర్ రాజేష్, డీఈలు రంగారావు, సురేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
