భద్రత విషయంలో రాజీ వద్దు..

భద్రత విషయంలో రాజీ వద్దు..

  • కేటీకే-5 గనిలో జీఎం రాజేశ్వర్ రెడ్డి సూచన

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రమాదాల నివారణకు ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి సూచించారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 భూగర్భ గనిలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఉద్యోగుల భద్రత సంస్థకు అత్యంత ప్రాధాన్యమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు. సంస్థ నిర్దేశించుకున్న ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పనికి ముందు భద్రతా పరిస్థితులను పరిశీలించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీ‌పీఈ) వినియోగించ డం, యంత్రాలను నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. పనిస్థలంలో అసురక్షిత పరిస్థితులు గమనిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, ఏరియా ఇంజనీర్ రాజారావు, కేటీకే-1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, కాలరీ మేనేజర్ ఎం.రమేష్, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.