ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలే ప్రభుత్వ లక్ష్యం

  • కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి

చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి అన్నారు.

ఆదివారం చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన బుర్ర స్వరూప్ చంద్ర గౌడ్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధితో పాటు రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.