నిరీక్షణకు ముగింపు..
- 22ఏ అర్జీలకు శీఘ్ర పరిష్కారం
- తాజాగా మరో ఏడుగురికి పత్రాల అందజేత
- అత్యంత పారదర్శకంగా దరఖాస్తుల పరిష్కారం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 22-ఏ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్హులైన పట్టాదారులకు ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం జరిగేలా అన్ని స్థాయిల్లో సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
22ఏ నుంచి తొలగించి భూ యాజమాన్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించి సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. ఏడు కేసులకు సంబంధించి 75 ఎకరాల 41 సెంట్లకు విముక్తి కల్పిస్తూ ధ్రువీకరణపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిష్కారమైన కేసులకు సంబంధించి అర్జీదారులకు పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. భూ వివాద రహిత గ్రామాలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. 22ఏ నిషేధిత భూముల జాబితాలో పొరపాటున నమోదైన పట్టా భూముల తొలగింపు అధికారం రెవెన్యూ డివిజనల్ అధికారులకు బదలాయించడం వల్ల మరింత వేగంగా అర్జీల పరిష్కారం జరుగుతుందన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ కార్యాచరణపై అర్జీదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
