సత్యదేవునికి అమ్మవారి పట్టువస్త్రాలు

సత్యదేవునికి అమ్మవారి పట్టువస్త్రాలు
- ఇంద్రాకిలాద్రి నుండి సంప్రదాయంగా సమర్పణ..
- తీసుకువెళ్లిన దుర్గగుడి చైర్మన్, ఈఓ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని, విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధి నుండి పట్టువస్త్రాలను సోమవారం అత్యంత వైభవంగా సమర్పించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఇంద్రకీలాద్రి దేవస్థానం తరపున అధికార బృందం రత్నగిరి క్షేత్రానికి చేరుకుంది.
ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు, ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు పట్టువస్త్రాలతో అన్నవరం చేరుకోగా, రత్నగిరి దేవస్థాన అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మంగళవాయిద్యాల నడుమ శ్రీ కనకదుర్గ అమ్మవారి తరపున పట్టువస్త్రాలను, పూజా సామాగ్రిని స్వామి వారికి భక్తిశ్రద్ధలతో అందజేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనం అనంతరం, అన్నవరం దేవస్థాన ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో వేద పండితులు విజయవాడ బృందానికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేవస్థానాల అధికారులు ఆధ్యాత్మిక విశేషాలను పంచుకున్నారు. ఈ విశేష కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, దేవస్థానం ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, దేవస్థాన సిబ్బంది ఎమ్. జయప్రకాష్ (జెపి), కె. లీలాకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
