Fire Accident | అప్రమత్తతతో తప్పిన భారీ ప్రమాదం
విద్యుత్ సరఫరా నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సిబ్బంది
భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడ పాతబస్తీ పరిధిలోని గొల్లపాలెం గట్టు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం కరెంట్ స్తంభానికి అమర్చిన ఓ ప్రముఖ సంస్థకు చెందిన వైఫై మోడెం బాక్స్ పేలడంతో స్థానికంగా కలకలం రేగింది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికుల వివరాల ప్రకారం.. పరశురామయ్య వీధి చివర ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోని కరెంట్ స్తంభానికి అమర్చిన వైఫై మోడెం బాక్స్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. దీంతో స్తంభానికి కట్టిన వైఫై, కేబుల్ వైర్లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.
మంటలు పైభాగంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల వరకు వ్యాపించడంతో పాటు గృహ విద్యుత్ సరఫరా తీగలను కూడా తాకాయి. స్తంభం కింద నిలిపి ఉంచిన ఓ ద్విచక్ర వాహనం కూడా మంటల్లో దెబ్బతింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమీప ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకురావడంతో పరిస్థితి సద్దుమణిగింది. సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తుండగా, వైఫై మోడెం బాక్స్‌లో సాంకేతిక లోపమే పేలుడుకు కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
