ఇంధన ధరలపై వైసీపీ వినూత్న నిరసన

ఇంధన ధరలపై వైసీపీ వినూత్న నిరసన

ఎడ్లబండిపై బైక్‌లు ఎక్కించి ప్రభుత్వానికి హెచ్చరిక
ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వంపై దేవినేని అవినాష్ ఫైర్
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ ఎమ్మార్వోకు వినతిపత్రం

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అదనపు భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు.పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండిపై ద్విచక్ర వాహనాలను ఎక్కించి, స్వయంగా ఎడ్లబండిని లాగుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వినూత్న నిరసన నగర ప్రజల దృష్టిని ఆకర్షించింది.ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పటమట VMC సర్కిల్-3 కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ వారి నడ్డి విరుస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి రాష్ట్రాన్ని దేశంలోనే అధిక ధరలు ఉన్న రాష్ట్రాల జాబితాలో నిలిపారని ఆరోపించారు.

ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇంధన ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలకు పొదుపు పేరుతో సైకిళ్లు తొక్కాలని చెప్పడం రాజకీయ ప్రదర్శనగా మారిందని విమర్శించారు. నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఇంధన ధరలను తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంక్షోభ సమయాల్లో కూడా సంక్షేమ పథకాలు ఆగలేదని, ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.

ప్రస్తుతం ప్రజలు జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. గ్యాస్ సరఫరా సమస్యలు, పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి పాలన రాష్ట్ర చరిత్రలో చూడలేదని దేవినేని అవినాష్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబుతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply