కళా వైభవానికి ప్రతీక బళ్లారి రాఘవ..
- తెలుగు నాటక రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
( విజయవాడ, ఆంధ్రప్రభ ): తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలందించిన మహానటుడు బళ్లారి రాఘవ కళా వైభవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగ అభివృద్ధికి బళ్లారి రాఘవ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నటనకు నూతన ఒరవడిని తీసుకువచ్చిన మహానటుడిగా, కళను సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచిన మహోన్నత వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
ఆయన నటించిన అనేక నాటకాలు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండేవని.. వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశాలను అందించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. కళను సమాజ మార్పునకు ఒక శక్తివంతమైన సాధనంగా భావించిన బళ్లారి రాఘవ.. తన జీవితాంతం నాటక కళాభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేశారన్నారు. బళ్లారి రాఘవ ఆశయాలు, కళా వారసత్వం నేటి కళాకారులకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
