ఎండల్లో చల్లని చొరవ..

ఎండల్లో చల్లని చొరవ..

రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

విజయవాడ, ఆంధ్రప్రభ : మండిపోతున్న ఎండల వేళ ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో “హైడ్రేషన్ డ్రైవ్–2026” కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్లు, స్టేషన్ పరిసరాల్లో సంచరించే ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి వేసవి వేడిమిలో ఉపశమనం కల్పించారు.

దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ (ఎస్‌సీఆర్‌డబ్ల్యూడబ్ల్యూఓ) విజయవాడ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ప్లాట్‌ఫారం నంబర్–1 వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రాక సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్టేషన్‌లోని వేచి గదులు, క్లాక్‌టవర్ ప్రాంతం, ఆటో స్టాండ్ పరిసరాలు, ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సుమారు వెయ్యి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

తీవ్ర ఎండల సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు చెందిన సుమారు 20 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీతో పాటు ప్రయాణికులను క్రమబద్ధంగా నిలబెట్టి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.

ఈ సందర్భంగా ఎస్‌సీఆర్‌డబ్ల్యూడబ్ల్యూఓ అధ్యక్షురాలు వర్షా సోనాకియా మాట్లాడుతూ.. వేసవి తీవ్రత ప్రయాణికులు, ఫ్రంట్‌లైన్ సిబ్బందిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రజలు తగినంత ద్రవాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

చిన్న సహాయం కూడా ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నిహారిక, సంయుక్త కార్యదర్శి జ్ఞాన ప్రసూన, దక్షిణ మధ్య రైల్వే విజయవాడ విభాగ ప్రజాసంబంధాల అధికారి నుస్రత్ ఎం మండ్రుప్కర్, మహిళా సంక్షేమ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

వేసవి కాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Leave a Reply