కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదు

కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదు

కోడూరు, ఆంధ్రప్రభ : ఈ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే 59 అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కారాలు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడూరులో ఉపాధి హామీ నిధులతో తారు రోడ్డు నిర్మాణాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

దాదాగిరీ చేస్తామంటే లొంగవద్దన్నారు. ఎవరో బెదిరిస్తే భయపడవద్దన్నారు. ఈ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అధికారాలను కూడా లాక్కునేలా బెదిరించే ప్రయత్నం చేసే వారికి లొంగిపోతే ఇక ప్రజలకు తాము ఏం ధైర్యం ఇస్తామని ప్రశ్నించారు. ఎవ్వరైనా సరే అధికారులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దని మీ వెనక నేను నిలబడతా..అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం న్యాయబద్ధంగా పనిచేయాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి పని చేయాలని ఎవరు కోరినా ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు.

ఎవరికీ తలవంచాల్సిన పని లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించరని స్పష్టం చేశారు. కోడూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం ఘటనపై తీసుకున్న చర్యలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. కచ్చితంగా కోడూరు రోడ్డు ఘటన సీఎం దృష్టికి వెళుతుందన్నారు.

అవినీతిరహిత, పారదర్శక, చట్టబద్ధ పరిపాలన అందించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనల ప్రకారమే నియోజకవర్గంలో పనిచేస్తున్నామని, తదనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకుల్లో అవనిగడ్డ నియోజకవర్గానికి రాష్ట్రంలో 11వ ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు లభించాయని తెలిపారు. అధికారులు ఎవరో ఒకరి బెదిరింపులకు భయపడవద్దని, చట్టం అనుసరించి ముందుకు వెళ్లాలని, మీ వెనక నేనుంటానని స్పష్టం చేశారు. అరాచకాలు, అవినీతికి తాను వ్యతిరేకం అన్నారు. తప్పుడు పనులు చేసే వారిని ప్రోత్సహించేది లేదన్నారు. అరాచకాలు, బెదిరింపులకు లొంగేది లేదన్నారు. తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని, వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు.


సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎంపీడీఓ సుధా ప్రవీణ్, ఇంచార్జి తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.