యూరియా స్టాక్ పాయింట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
యూరియా స్టాక్ పాయింట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఎడపల్లి, ఆంధ్రప్రభ:
జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో, సేల్ పాయింట్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు.
మంగళవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట, ఎడపల్లి ప్రాంతాల్లోని ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించి, స్టాక్ వివరాల రిజిస్టర్‌లో పొందుపరచిన వివరాలకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఎరువుల బస్తాలు వచ్చాయి, ఎన్ని పంపిణీ చేశారు, ఇంకా ఎంత పరిమాణంలో నిల్వలు రావాల్సి ఉంది అనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
యూరియా బుకింగ్ యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించి, యాప్ వల్ల సమకూరే ప్రయోజనాలను రైతులకు వివరించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న బుకింగ్ యాప్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఎరువుల పంపిణీ కోసం అమలు చేస్తున్నాయని తెలిపారు. గత రబీ సీజన్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ విధానం అమలు చేశామని గుర్తు చేశారు.
ఎరువులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీకి బుకింగ్ యాప్ దోహదపడుతుందని, దీనిపై రైతులు అపోహలకు గురి కావద్దని సూచించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రయోగాత్మకంగా కొంత పరిమాణంలో నానో యూరియాను వినియోగించి ఫలితాలను స్వయంగా పరిశీలించాలని రైతులకు సూచించారు.
అయితే రైతులను నానో యూరియా కొనుగోలు చేయాలని బలవంతం చేయరాదని, వారు కోరిన ఎరువులు మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లా రైతుల అవసరాలకు సరిపడా ప్రస్తుతం 27 వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఎక్కడా కొరత ఏర్పడకుండా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామని చెప్పారు. పలు సొసైటీలు డిఫాల్ట్‌లో ఉన్నప్పటికీ, అక్కడి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా డీసీఎంఎస్ ద్వారా ఎరువుల పంపిణీ జరుగుతోందన్నారు.
బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎరువుల పంపిణీ ప్రారంభించామని, త్వరలో నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా పక్కాగా పంపిణీ జరగేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.
కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ దత్తాద్రి, జానకంపేట సర్పంచ్ అనురాధ రాధాకిషన్ గౌడ్, ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్, జానకంపేట సొసైటీ చైర్మన్ నరేందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధిరామేశ్వర్, ఎంపీడీఓ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
