నిరుద్యోగ యువతకు శిక్షణతో ఉపాధి అవకాశాలు: కలెక్టర్ కె. హరిత

నిరుద్యోగ యువతకు శిక్షణతో ఉపాధి అవకాశాలు: కలెక్టర్ కె. హరిత

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు వృత్తి విద్యా కోర్సులలో ఉచితంగా శిక్షణ తీసుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు.

మంగళవారం జైనూర్ మండల కేంద్రంలోని కెఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి విద్యా కోర్సులలో ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు మూడు నెలల పాటు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందని, కాబట్టి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.

జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మొత్తం ఎనిమిది రకాల వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తుందని, శిక్షణ పూర్తికాగానే ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు మూడు నెలల పాటు హైదరాబాద్‌కు వెళ్లి శిక్షణ పొందేందుకు ముందుకు రావడం చాలా సంతోషకరమని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

శిక్షణకు ఎంపికైన యువతీ యువకులకు జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ మూడు నెలల శిక్షణా కార్యక్రమం ఉంటుందని, జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ముందుకు వచ్చి హైదరాబాద్‌లోని శిక్షణా కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధులు, జిల్లా ఉపాధి శాఖ అధికారి, జైనూర్ ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, తహసిల్దార్ ఆడబీర్ షావ్, జైనూర్ సీఐ రమేష్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఈవో ఆనందరావు, ఉద్యోగులు, నాయకులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.