Report | ప్లేయర్లకు పునాది అక్కడి నుంచే అట.. !?
Report | ప్లేయర్లకు పునాది అక్కడి నుంచే అట.. !?
- నివేదికలో ఆసక్తికర విషయాలు
- ఇక టాలెంట్‌కు అడ్రస్ అవసరం లేదు..
ఒకప్పుడు భారత క్రీడల్లో రాణించాలంటే ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో పుట్టాలి.. అక్కడే ట్రైనింగ్ తీసుకోవాలి.. అక్కడే అవకాశాలు వెతుక్కోవాలనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని…. భారత క్రీడలకు కొత్త దిక్సూచిగా చిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు మారుతున్నాయని తాజా నివేదిక చెబుతోంది.
హురున్ ఇండియా, ఫ్యానాటిక్ స్పోర్ట్స్ కలిసి.. ఇండియాస్ మోస్ట్ వ్యాల్యూబుల్ స్పోర్ట్స్ టీమ్స్-2026 నివేదిక రూపొందించాయి. ఈ మేరకు దేశంలోని ఆరు ప్రధాన ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్న అథ్లెట్లలో.. కేవలం 16 శాతం మంది మాత్రమే ఏడు మెట్రో నగరాలకు చెందినవారు అని ఓ నివేదిక వెల్లడించింది. మిగతా 84 శాతం మంది టియర్-1, టియర్-2, టియర్-3 నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే.
ఈ అధ్యయనం కోసం ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, ఇండియన్ సూపర్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్, హాకీ ఇండియా లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లలో పాల్గొంటున్న 1,323 మంది అథ్లెట్ల వివరాలను పరిశీలించారు. వీరిలో 1,018 మంది భారతీయ క్రీడాకారులపై ప్రత్యేక విశ్లేషణ నిర్వహించారు.
నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. నగరాల నుంచి వచ్చిన 732 మంది అథ్లెట్లలో 617 మంది టియర్-1, టియర్-2, టియర్-3 నగరాలకు చెందినవారు. మెట్రో నగరాల నుంచి వచ్చిన వారు కేవలం 115 మంది మాత్రమే. అంటే భారత క్రీడా ప్రతిభ ఇప్పుడు కొన్ని నగరాలకే పరిమితం కాకుండా దేశం నలుమూలలా విస్తరించి ఉందని స్పష్టమవుతోంది.
ఈ మార్పుకు ప్రత్యక్ష ఉదాహరణగా బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేరు వినిపిస్తోంది. చిన్న పట్టణం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అతడు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే భారత ప్రొఫెషనల్ క్రీడల్లో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచింది హాకీ ఆటగాడు కేతన్ కుష్వాహా. కేవలం 14 ఏళ్ల వయసులోనే అతడు ప్రొఫెషనల్ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం.
రాష్ట్రాల వారీగా చూస్తే.. ఎలైట్ అథ్లెట్ల తయారీలో హర్యానా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆరు లీగ్‌ల్లో హర్యానాకు చెందిన 129 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహారాష్ట్ర 95 మంది అథ్లెట్లతో రెండో స్థానంలో, పంజాబ్ 81 మందితో మూడో స్థానంలో ఉన్నాయి. ఫుట్‌బాల్‌లో బలమైన ప్రాతినిధ్యం కారణంగా మణిపూర్, మిజోరం రాష్ట్రాలు కూడా టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ నివేదిక మరో ముఖ్యమైన మార్పును కూడా చూపిస్తోంది. ఒకప్పుడు క్రీడలను కేవలం హాబీగా చూసే కుటుంబాలు.. ఇప్పుడు దానిని కెరీర్ ఆప్షన్‌గా స్వీకరిస్తున్నాయి. చిన్న పట్టణాల్లోని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. అకాడమీలు పెరగడం, ప్రొఫెషనల్ లీగ్‌లు విస్తరించడం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం వంటి కారణాలతో క్రీడలపై యువతలో ఆసక్తి పెరుగుతోంది.
ఇక వ్యాపార పరంగా చూస్తే.. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా ఆస్తుల్లో ఒకటిగా మారుతోందని నివేదిక అంచనా వేసింది. 2032 నాటికి ఐపీఎల్ విలువ 15 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలవగా, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. మొత్తానికి.. భారత క్రీడల్లో ఇప్పుడు అడ్రస్ కంటే టాలెంట్‌కే విలువ పెరిగింది. పెద్ద నగరాల్లో పుట్టకపోయినా.. చిన్న ఊరి నుంచి వచ్చినా.. సరైన ప్రతిభ, కృషి ఉంటే దేశ స్థాయిలో గుర్తింపు సాధించవచ్చని ఈ నివేదిక మరోసారి స్పష్టం చేసింది.
