‘నా పిల్లలు ప్రభుత్వ బడిలోనే’.. గ్రామానికి ఆదర్శంగా సర్పంచ్

‘నా పిల్లలు ప్రభుత్వ బడిలోనే’.. గ్రామానికి ఆదర్శంగా సర్పంచ్

వేల్పూర్, ఆంధ్రప్రభ:
వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేందర్ ముందుగా తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, ఆ తర్వాత గ్రామ ప్రజలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ రాజేందర్ సమక్షంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే బస్సుల్లో ప్రయాణిస్తున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకరించాలని వారు కోరారు.

సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ టీచర్లను నియమించి విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఉదయం టిఫిన్ తదితర సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ర్యాడ నరేష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.