తిరుపతిలో మెగా డ్రగ్స్ టెస్టింగ్..
- రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్
- మాదక ద్రవ్యాల వినియోగదారులను గుర్తించి పునరావాస చర్యలు
- ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా’ లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ
తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని ఇందిరా మైదానంలో “డ్రగ్స్‌పై దండయాత్ర” కార్యక్రమంలో భాగంగా మెగా డ్రగ్స్ టెస్టింగ్ నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఈగల్ సెల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమానిత వ్యక్తులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి మత్తు పదార్థాల వినియోగదారులను గుర్తించే చర్యలు చేపట్టారు.
ప్రత్యేక కౌన్సెలింగ్
అలాగే రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులు, నేర ప్రవృత్తి కలిగిన వారిని ఇందిరా మైదానానికి పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి చట్టబద్ధమైన జీవితం గడపాలని సూచించారు. కుటుంబ సంక్షేమం, ఉపాధి, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అవగాహన కల్పించారు. భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్‌గా గుర్తించిన వారికి చట్టపరమైన చర్యలతో పాటు కౌన్సిలింగ్ అందించి, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ మరియు సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారిని సన్మార్గంలోకి తీసుకువచ్చే చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఈగల్ సెల్ అధికారులు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జీవితాలు నాశనం
ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక ప్రకటన చేశారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. ముఖ్యంగా యువత విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1972 (ఈగల్) లేదా 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే “డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలమని అన్నారు.
