గుడివాడకు ఐకానిక్ షాదీఖానా.. నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- సీఎం చంద్రబాబు హామీతో కార్యాచరణ ముమ్మరం..
- ఆధునిక సౌకర్యాలతో అన్ని వర్గాలకు ఉపయోగపడేలా రూపకల్పన
గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ మైనార్టీల ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న షాదీఖానా నిర్మాణం త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, ప్రణాళిక నిపుణులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. షాదీఖానా నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, ఆధునిక నమూనా, వ్యయ అంచనాలు, టెండర్ల ప్రక్రియ, తదుపరి కార్యాచరణపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గుడివాడ షాదీఖానా నిర్మాణ అవసరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి నిర్మాణానికి హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీ మేరకు ఇప్పుడు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అత్యాధునిక నమూనాతో షాదీఖానా రూపకల్పన జరుగుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ భవనం కేవలం మైనార్టీ వర్గాలకే పరిమితం కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల ప్రజలు కూడా వినియోగించుకునే విధంగా నిర్మించనున్నట్లు వివరించారు.
త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి మైనార్టీ సోదరులతో పాటు స్థానిక ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.
