ఏపీ రెండేళ్లలో నమ్మశక్యం కాని అభివృద్ధి: పీవీఎన్ మాధవ్

ఏపీ రెండేళ్లలో నమ్మశక్యం కాని అభివృద్ధి: పీవీఎన్ మాధవ్

  • విశాఖ ఉక్కు ప్రమాద మృతులకు నివాళి
  • రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడి
  • డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో వేగంగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్
  • ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని పిలుపు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. దామినేడు వద్ద నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.

ప్రసంగం ప్రారంభంలో నాలుగు రోజుల క్రితం విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మరణించిన తొమ్మిది మంది కార్మికులకు ఆయన నివాళులర్పించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ, బాధిత కుటుంబాలకు ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి నిజంగా నమ్మశక్యం కాని స్థాయిలో ఉందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం విశేషమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన గూగుల్ తన దేశం వెలుపల అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడం రాష్ట్ర ప్రతిష్ఠను పెంచిందన్నారు.

అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంస్థలు సంయుక్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో 10 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవబోతోందని, సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఇంధన రంగంలో రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతుందన్నారు.

రక్షణ రంగానికి సంబంధించిన అనేక పరిశ్రమలు, క్షిపణుల తయారీ యూనిట్లు, ఏరోనాటిక్స్, ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భద్రతకు అవసరమైన పలు రకాల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే తయారయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇటువంటి అనేక నమ్మశక్యం కాని అభివృద్ధి కార్యక్రమాలు గత రెండేళ్లలో రాష్ట్రంలో జరిగాయని తెలిపారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తెలియజేసి, ప్రభుత్వంపై మరింత నమ్మకం పెంచాలనే ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయనకు ప్రశంసలు లభించాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని శాఖల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రభుత్వానికి బలంగా నిలుస్తున్నారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రస్తావించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం విషయమై మాట్లాడిన పీవీఎన్ మాధవ్, గతంలో కర్మాగారం సంక్షోభంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, చంద్రబాబు నాయుడు కలిసి దానిని రక్షించారని చెప్పారు. ప్రస్తుతం మరోసారి సమస్యలు ఎదురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన సహాయం అందించి కర్మాగారాన్ని నిలబెట్టేందుకు చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వని విధంగా రూ.11,414 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని విశాఖ ఉక్కు కర్మాగారానికి అందించారని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే నిర్ణయం తీసుకోవడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

ప్రతిపక్షాల తీరును విమర్శించిన ఆయన, అభివృద్ధిని చూడకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని ప్రతిపక్షాలకు సూచించారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని ప్రశ్నించారు. ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసంతో భారీ మెజారిటీ ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి లక్ష్యంగా పనిచేస్తోందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రకటించిన పెట్టుబడులు కేవలం కాగితాలపైనే కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి జరిగి మరింత సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు.

ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, ఎల్ఈడీ బల్బులు, జల్ జీవన్ మిషన్ తాగునీటి కనెక్షన్లు, ఉచిత బియ్యం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని చెప్పారు. ఈ ప్రయోజనాలను ప్రజలకు మరింతగా వివరించాలని సూచించారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందని పీవీఎన్ మాధవ్ అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మారుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” స్ఫూర్తితో అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.