అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలి
రైతుల ప్రయోజనాల కోసం ఎంఎస్పీకి చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు.
ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలోని పీవీ రావు భవన్‌లో నిర్వహించిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరిగి, దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. పత్తిపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల దేశీయ పత్తి ధరలు పడిపోతుండగా, కార్పొరేట్ సంస్థలకే లాభాలు చేకూరుతున్నాయని విమర్శించారు.
రైతులకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు చేయాలని కోరారు. అలాగే ఎంఎస్పీకి చట్టబద్ధ హామీ, రుణ విమోచన చట్టం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, పంట బీమా, సులభ రుణ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన ఉద్యమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎల్దేశ్ నాయక్, శంకర్ నాయక్, మల్లేష్, నిర్మల, సైదులు, గుండె మల్లేష్, బి. రాములు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
