ఆర్టీసీ సిబ్బంది అమానుషం

  • ఎండలో వృద్ధురాలిని దించిన నిర్లక్ష్య వైఖరి


ఏర్పేడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, వృద్ధులు, చిన్నారుల ప్రయాణ సౌకర్యార్థం స్రి శక్తి పేరుతో ఉచిత బస్సు సర్వీసులను ప్రవేశపెట్టి ఎంతో ఆదరణ పొందుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల బాధ్యతారాహిత్యం, అమానుష ప్రవర్తన వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి-శ్రీకాళహస్తి, ఏర్పేడు-వెంకటగిరి మార్గాల్లో ఆర్టీసీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​వృద్ధురాలి పట్ల కఠినంగా..

తాజాగా శనివారం చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. వెంకటగిరి డిపోకు చెందిన బస్సు (ఏపీ 39 జెడ్ 0075) ఏర్పేడు పీహెచ్‌సీ వద్ద రామానుజపల్లికి చెందిన వి. నాగమ్మ (65) అనే వృద్ధురాలిని, ఆమె మనవరాలు భూమికను ఎక్కించుకుంది. వారు రామానుజపల్లి క్రాస్ వద్ద దిగాల్సి ఉండగా, డ్రైవర్, కండక్టర్లు పట్టించుకోకుండా బస్సును ముందుకు పోనిచ్చారు.

​కనీసం మధ్యలో ఉన్న టోల్ గేట్ వద్ద ఆపమని వేడుకున్నా సిబ్బంది వినిపించుకోలేదు. చివరికి ఎటువంటి స్టాపింగ్ లేని ఏర్పేడు ఫ్లైఓవర్ పై మండుటెండలో వృద్ధురాలిని, చిన్నారిని దించేసి వెళ్ళిపోయారు. “ఎల్‌ఎస్‌ఎస్ బస్సు ఎక్కడపడితే అక్కడ ఆగదు” అని వాదించిన కండక్టర్, స్టాపింగ్ లేని ఏర్పేడులో ఎలా ఆపారో చెప్పలేక నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. టోల్ గేట్ వద్ద బస్సు వేగం తగ్గినప్పుడు కూడా దిగనివ్వకుండా అడ్డుకోవడంతో తోటి ప్రయాణికులు సైతం అవాక్కయ్యారు.

​అసహనంతో అమానుషం..

ఈ మార్గాల్లో బస్సులు టౌన్‌లోకి రాకుండానే వెళ్ళిపోవడం, మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ అమానుషంగా మాట్లాడటం పరిపాటిగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రజా సేవగా భావించకుండా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వి. నాగమ్మ కుటుంబ సభ్యులు, స్థానిక గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా సిబ్బందికి తగిన శిక్షణ, అవగాహన కల్పించాలని కోరుతున్నారు.