ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమం..
ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమం..
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆర్టీసీ కార్మికులు గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తాము నిర్వహిస్తున్న ఆందోళన ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమం కాదని, ఆర్టీసీ పరిరక్షణ మరియు అభివృద్ధి కోసమే ఈ ధర్నా చేపట్టినట్లు స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి నిర్వహించాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించకూడదని డిమాండ్ చేశారు. రన్నింగ్, నిర్వహణ మొత్తం ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగితే సంస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
పలు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఆర్టీసీ ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదని, వైద్యసదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.
రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లు ఆలస్యం కావడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్త్రీ శక్తి బస్సుల్లో అమలవుతున్న జీరో టికెట్ విధానాన్ని సవరించి, మిగతా ప్రయాణికులకు సాధారణ టికెట్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని తెలిపారు.
టిమ్ము (టికెట్ మిషన్) ద్వారా టికెట్ జారీ చేసే విధానంలో సాంకేతిక లోపాలు ఎక్కువగా ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వికలాంగుల టికెట్, జనరల్ టికెట్, స్త్రీ శక్తి టికెట్ వంటి వేర్వేరు ఆప్షన్లు ఉండటంతో, ఒక టికెట్ ఎంపిక చేసే సమయంలో మరో ఆప్షన్‌కు టచ్ అవుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు.
ఈ సాంకేతిక సమస్యల వల్ల సమయం వృథా కావడంతో పాటు ప్రయాణికులు గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుతున్నారని తెలిపారు.
దీంతో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పెన్షన్, సెటిల్మెంట్లు, వైద్యసదుపాయాల అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డిపో సెక్రటరీ ఎం. కిరణ్ కుమార్, పి.ఎన్.వి. శిరీష గ్యారేజ్ సెక్రటరీతో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
